ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో గండం ముంచుకొస్తోంది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. నవంబర్ 30వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
రాయలసీమలో వర్షాలు రోజు రోజుకు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలసంద్రంగా మారాయి. ఎటు చూసినా జల సంద్రమే కనిపిస్తోంది. అయితే తాజా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. మరో 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయి. రాయలసీమ మీదుగానే అల్పపీడనం కొనసాగుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో కూడా దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రామేశ్వరంలో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాజధాన్ని చెన్నైలోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.