రాష్ట్ర శాసన సభ సమావేశాల సమయంలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి వైసిపికి 2 ప్రశ్నలు కేటాయించామని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు చెప్పారు. అయితే వైసిపి సభ్యులు ఆరెండు ప్రశ్నలు సభకు సమర్పిస్తున్నారే గానీ, వాటిని అడిగేందుకు సభకు మాత్రం రావడం లేదని, అందువల్ల ఆరెండు ప్రశ్నలు వృధా అవుతున్నాయన్నారు. ఇక మీదట ఆవిధంగా ప్రశ్నలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఇకనైనా వైసిపి సభ్యులు సభకు రావాలని హితవు పలుకుతూ, వస్తారో రారో కూడా స్పష్టంగా తెలియ జేయాలని, లేదంటే ఆ రెండు ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే ఆలోచన చేయక తప్పదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ భవనంలో కోటిన్నర రూ.ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్ ముద్రణా యంత్రాలను గురువారం అసెంబ్లీ భవనంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ-జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపై పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. స్పీకర్, శాసన సభకే హాజరు కాని వారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల గురించి అడగ్గా, గతంలో నామినేషన్ వేసేందుకు కూడా భయపడ్డ ప్రాంతాల్లో, భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనడానికి నిదర్శనమన్నారు.