సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి సుదీర్ఘ ప్రయత్నాలు చేసి చివ‌ర‌కు విజ‌యం సాధించారు. తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల‌నే ఆమె ప్ర‌య‌త్నం ఫ‌లించింది. డిప్యూటేష‌న్ మీద తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ చేయించుకోవాల‌ని ముందు అనుకున్నారు. డిప్యుటేషన్‌ కుదరదని స్పష్టం చేయ‌డంతో.. ఆమె త‌న కేడ‌ర్‌ను మార్చుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మార్పించుకున్నారు.

క్యాట్‌ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం శ్రీలక్ష్మిని రిలీవ్ చేసింది. దీంతో.. ఆమె అమరావతిలోని సచివాలయంలో జీఏడీలో రిపోర్టు చేశారు. కాగా వైఎస్ జగన్‌.. ఏపీ సీఎం అయిన వెంటనే.. తెలంగాణ కేడర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై పంపించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు. అయితే.. కార్య‌ద‌ర్శి, ఆపై స్థాయి అధికారుల‌ను డిప్యుటేష‌న్ మీద ఇత‌ర రాష్ట్రాల‌కు పంపించ‌డం కుద‌ర‌ని చెబుతూ.. శ్రీల‌క్ష్మి డిప్యుటేష‌న్‌కు కేంద్రం అంగీక‌రించ‌లేదు. దీంతో త‌న కేడ‌ర్‌ను మార్చాల‌ని కోరుతూ.. ఆమె క్యాట్‌ను ఆశ్ర‌యించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి కీలక పదవుల్లో పనిచేశారు. అనంతరం ఓబులాపురం గనుల వ్యవహారంలో చిక్కుకుని సీబీఐ తాఖీదులు పొందారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి.. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్నారు. అనంతరం తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్పై వచ్చేందుకు దరఖాస్తు చేశారు.
సామ్రాట్

Next Story