ఏపీలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏపీ సర్కార్ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సీఎం జగన్.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, సహా పలువురు నాయకులు ముందు వరుసలో కూర్చున్నారు. వారి వెనుక ఐఏఎస్ అధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను.. సీఎం జగన్ ఏదో విషయమై పిలిచారు.
అయితే సీఎం దగ్గరికి వచ్చిన అధికారి మోకాళ్లపై కూర్చొని మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సీఎం ముందు అధికారి మోకాళ్లపై కూర్చుని మాట్లాడటంపై భిన్నమైన స్పందన వస్తోంది. ఈ ఘటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లపై మాజీ కలెక్టర్ వెంకట రామయ్య పడ్డారు. ఇది అప్పట్లో సంచలనమే రేపింది.