ప్రతీ మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత నాది: చంద్రబాబు

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

By అంజి  Published on  23 April 2024 4:09 PM IST
APPolls, woman, Andhra Pradesh,  millionaire, Chandrababu

ప్రతీ మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత నాది: చంద్రబాబు

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, కానీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మాత్రం సొంత చెల్లికే ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతీ మహిళను లక్షాధికారిని చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆడ పిల్లలకు పుట్టినిల్లు టీడీపీ అని చంద్రబాబు అన్నారు.

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారని.. మభ్య పెట్టే ఎన్నో మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని తమ హయాంలో మహిళా యూనివర్సిటీలు స్థాపించామన్న చంద్రబాబు.. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించామన్నారు. ఆడ బిడ్డల చదువుకు టీడీపీ ఎంతో కృషి చేసిందన్నారు. ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు.

Next Story