ఈ డిజిటల్ యుగంలో కూడా గుర్రాలపై స్కూల్ కు వెళుతున్న పిల్లలు

How in this digital-age tribals take kids to school on horseback. డిజిటల్ యుగం.. పిల్లలు చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, వర్చువల్ క్లాసెస్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jan 2023 3:25 PM IST
ఈ డిజిటల్ యుగంలో కూడా గుర్రాలపై స్కూల్ కు వెళుతున్న పిల్లలు

డిజిటల్ యుగం.. పిల్లలు చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, వర్చువల్ క్లాసెస్.. ఇలా ఎన్నో సదుపాయాలు ఉంటున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఊళ్ళల్లో ఇంకా పాఠశాలలకు వెళ్లాలంటే చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలు మారుమూలన ఉండడం.. ప్రభుత్వాలు వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వంటి ఎన్నో కారణాల వలన ఆయా గ్రామాలకు చెందిన పిల్లలు చదువుకోవాలంటే కొన్ని రిస్క్ లు కూడా తీసుకోకతప్పడం లేదు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 'నేరేడు బండ' గ్రామంలోని విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాలంటే గుర్రాలపై ఎక్కాల్సిందే. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్లు పైబడిన 15 మంది పిల్లలు చదువుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్రాలపై స్కూళ్లకు పంపిస్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని 'నేరేడు బండ' అటవీ ప్రాంతం. ఈ గిరిజన గ్రామానికి సరైన రోడ్డు, పాఠశాల, ఆసుపత్రి వంటి సౌకర్యం లేదు. 12 కుటుంబాలు ఉన్న గ్రామంలో 28 మంది పిల్లలు ఉండగా అందులో 15 మంది జోగంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు 2020లో ఆధార్ కార్డులు జారీ చేశారంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

నేరేడు బండలో పాతిక లోపు కుటుంబాలు ఉన్నాయి. మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవటంతో ఒకప్పుడు ఇక్కడ జన్మించిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ కాలేదు. మండలంలో గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలూరు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తూ చేసుకుంటే నేరేడుబండ గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది గతంలో చెప్పారు. ఈ మధ్యనే కాస్త మార్పు వచ్చి 2020లో పిల్లలకు ఆధార్ కార్డులు ఇచ్చారు.

నిబంధనల ప్రకారం, పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లికి విద్యా ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 15,000 అందించే అమ్మ ఒడి పథకాన్ని పొందేందుకు విద్యార్థులు 75% అటెండెన్స్ కలిగి ఉండాలి. విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడానికి కొండ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నడవాలి. గ్రామంలో ఐదు గుర్రాలపై తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ కు తీసుకెళ్తున్నారని ఏపీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.గోవిందరావు అన్నారు.

అడవుల్లో ప్రయాణం అంటే వన్యప్రాణుల భయం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. పులుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులను అధికారులు సూచించారు. "మేము జి మాడుగుల-రవికమతం సరిహద్దు ప్రాంతం సమీపంలో నివసిస్తున్నాము. మా పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం కష్టంగా మారింది. మా విన్నపానికి పంచాయతీ అధికారి స్పందించడం లేదు. మేము ఒక పాఠశాల, ఉపాధ్యాయుడిని కోరుతున్నాము. మేమే పాఠశాల నిర్వహణను చూసుకుంటాము" అని నేరేడు బండ గ్రామస్థుడు అప్పారావు చెప్పారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓట్ల కోసం బూటకపు వాగ్దానాలు చేస్తుంటారని, ఎన్నికల తర్వాత అధికార పార్టీ సభ్యులు ఎవరూ మా వద్దకు రారని అన్నారు. స్థానిక కార్యాలయాల్లో మమ్మల్ని చూసినా మా వినతులు పట్టించుకోవట్లేదని గ్రామస్థులు వాపోయారు.

గ్రామంలో ఉన్న ఏకైక మట్టిరోడ్డు పూర్తిగా పాడైంది. వారు వెళ్లే దారి బ్రిటీష్‌కాలంలో పేపర్‌ తయారికోసం వెదురు కర్రలను సరఫరా చేయడానికి వేశారు. కాలక్రమేణా అది పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నేరేడుబండ గ్రామ చిన్నారులు స్కూల్ కు పోయేందుకు రోజూ కిలోమీటర్లు కొండదిగి వెళ్లాల్సి వచ్చేది. అయితే రోడ్డు దెబ్బతినడంతో ఇప్పుడు మోటారు సైకిల్ వెళ్లడం కూడా కష్టమే..! కొన్ని వారాల క్రితం, గిరిజనులు ద్విచక్ర వాహనాలు, వారి గుర్రాలు తరలించడానికి వీలుగా దారిని పునరుద్ధరించారు. ప్రభుత్వాలు, అధికారులు తమను ఉద్దరించేది లేదని భావించిన గ్రామస్థులు బ్రిటీష్ కాలం నాటి రోడ్డును తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ కలిసి కేవలం మూడు రోజుల్లోనే రోడ్డు మార్గాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని అధికారులు పట్టించుకోవాలని గ్రామస్థులు కోరారు. "ఈనెల 25న కలెక్టరేట్‌ ముట్టడికి గిరిజనులు నిర్ణయించారు. మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోకుంటే నేరేడు బండ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తాము" అని గిరిజనులు తెలిపారు.


Next Story