అందరికీ ఇళ్లు పథకం పేరులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఈ మేరకు జీవో నెంబర్ 23ను రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా జారీ చేశారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పన ఇంట్లో మహిళ పేరుతో ఇంటి స్థలం కేటాయించనుంది. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటి స్థలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాత లభిస్తాయని వెల్లడించింది. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలని సూచించారు. ప్లాట్‌ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.