ఉద్దేశపూర్వకంగానే గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

Home Minister Thaneti Vanitha Reacts On Amalapuram High Tension. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు,

By Medi Samrat  Published on  24 May 2022 1:24 PM GMT
ఉద్దేశపూర్వకంగానే గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయని హోంమంత్రి తానేటి వ‌నిత అన్నారు. అమ‌లాపురం ఉద్రిక్త‌త‌పై హోంమంత్రి స్పందిస్తూ.. స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చడం జరిగిందని తెలిపారు. డా. బీఆర్. అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమ‌ని.. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరం అని అన్నారు.

కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని.. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించారు. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు ల ను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయని.. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

పోలీసులపై జరిగిన దాడిని ఖండించిన హోంమంత్రి.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశించారు.













Next Story