రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 12 వ తేదీ అర్థరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో మైనర్ బాలికపై నేరచరిత్ర ఉన్న వ్యక్తి దాడిచేసి హత్యచేయడం ఎంతో దురదృష్టకరమైన విషయమన్నారు. మధ్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగిందని, గంజాయి మత్తు ఇందుకు ఏమాత్రం కారణం కాదని ఆమె తెలిపారు. వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు. అయితే ఈ దురదృష్టకర సంఘటనను ఆధారంగా చేసుకుని ప్రదాన ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఆమె ఖడించారు.