తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ పై ఏపీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదలే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని తాము చెప్పడం లేదని, అయితే నేరస్తుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. గుంటూరు బాలికల వ్యభిచారం కేసులో ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. వినోద్ జైన్ లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీక్షలు చేస్తారని ప్రశ్నించారు. నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదని సునీత స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజలంతా చూస్తున్నారు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అన్నారు. టీడీపీలో చాలా మంది నాయకులు దుశ్శాసనుల్లా మారారని, కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దిశా చట్టం తీసుకొచ్చి మహిళకు అండగా నిలిచిన ఘనత తమదని అన్నారు.