తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు.. చంబల్ లోయలో ఉండాల్సిన వ్యక్తి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

High Tension In Tadiparthi. గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  28 Dec 2020 12:58 PM GMT
తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు.. చంబల్ లోయలో ఉండాల్సిన వ్యక్తి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య నెలకొన్న వివాదం వల్ల తాడిపత్రి పట్టణంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఏ వర్గం ఏ ప్రాంతంలో గొడవ పెట్టుకుంటుందా అని అధికారులు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డిపై, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గంపై కేసులు నమోదయ్యాయి.

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేందుకు జేసీ ఉన్నట్టుండి బయల్దేరారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దని ఆయనను అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తాడిపత్రి పట్టణంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దుకాణాలను పోలీసులు మూసేయించారు. జేసీ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

పెద్దారెడ్డి వర్గీయులు చేసిన దాడిపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ఇంటిపై పెద్దారెడ్డి మనుషులు చేసిన దాడిని సీసీ ఫుటేజ్ లో పరిశీలించి పోలీసులే సుమోటోగా కేసు బుక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై ఉన్న గౌరవంతోనే తమనే సుమోటోగా కేసు బుక్ చేయాలని చెప్తున్నామని, తాము ఫిర్యాదు చేస్తే 9 మంది గన్ మ్యాన్లు, ఒక ఎస్సై సస్పెండ్ అవుతారన్నారు. 1990లో పెద్దారెడ్డికి చెందిన ట్రూఫ్ ప్రజల నుంచి చీరలు, నగలు ఎత్తుకెళ్లడమే కాకుండా పప్పూరులో ఇళ్లు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ గుర్తు చేశారు. 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాడికి గన్ మెన్ ఇవ్వడం బాధాకరమని అన్నారు. చంబల్ లోయలో ఉండాల్సినోడు నేడు ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యేగా ఉండటం మన దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని, ఇకనైనా పోలీసులు తమ పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్ అంతా సర్వనాశనం అయిపోతుందని అన్నారు.


Next Story
Share it