అనంతపురం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పోరు తీవ్రమైంది. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా జేసి వర్గమే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. ఆగ్రహంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై దాడి చేశారు.
అయితే.. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తమ నివాసంలో లేరు. దాంతో ఇంట్లో వున్న జేసీ అనుచరులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్దవాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. తాజా ఘటనతో జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.