కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలోని గ్రామస్తులు గ్రామంలోకి ఎమ్మెల్యేను రాకుండా అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేను వెనక్కి వెళ్లిపోలాంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో 1400 తెల్ల రేషన్ కార్డులు ఉంటే.. 400 మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. వేరే గ్రామాల వారికి తమ ఊరిలో పట్టాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేది ఏమీ లేక వంశీ వేదిక వద్దకు వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే. ఆ గ్రామంలో వైసీపీలో గ్రూపు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వంశీ వర్గం ఓవైపు.. పాత వైసీపీ నేతలు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.