అమరావతి: రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు ఏపీని అనుసంధానిస్తాయని తెలిపారు.
హైదరాబాద్ - బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో అనంతపురం, కర్నూలు కలుస్తాయని, హైదరాబాద్ - చెన్నై కారిడార్‌లో అమరావతి, తిరుపతి కలుస్తాయని, బెంగళూరు - చెన్నై కారిడార్‌లో చిత్తూరు జిల్లాలోని పలమనేరు రానుందని తెలిపారు. దానిని తిరుపతికి కలిపి అటు నుంచి చెన్నై కనెక్ట్ చేయాలని కోరామని సీఎం తెలిపారు. కొత్త బడ్జెట్ పౌరుల జీవనశైలిని మారుస్తూ రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నూతన దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు.
7 హైస్పీడ్ రైళ్లు..
నిన్న కేంద్ర బడ్జెట్ 2026 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడింది. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి నిర్మల 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ముంబై - పుణే, పుణే - హైదరాబాద్, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, ఢిల్లీ - వారణాసి, వారణాసి - సిలిగిరి, చెన్నై - బెంగళూరు మధ్య ఏడు కారిడార్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.