ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
High Court Orders To AP Govt. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది
By Medi Samrat Published on 29 Dec 2020 2:26 PM ISTఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రతులు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని ఆదేశించింది. ఈ భేటి కోసం వేదికను నిమ్మగడ్డనే నిర్ణయించాలని న్యాయస్థానం సూచించింది.
కాగా.. ఎన్నికల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వాధికారులు ఎస్ఈసీ ముందుంచాలని స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతుందో ప్రభుత్వానికి ఎస్ఈసీ వివరించాలని ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది. అందుకు.. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చేలా మూడ్రోజులు గడువు విధిస్తున్నట్టు న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పట్టుబడుతుండగా.. జగన్ సర్కార్ ససేమీరా అంటోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.