ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
High court hearing on AP government pettion I ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
By సుభాష్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్ పై స్టేటస్ కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలపై పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అనువైన పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సలహా, అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సంఘం నవంబర్‌లో ఉత్తర్వులిచ్చిందన్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటికే 6వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి మూడు సార్లు తెలియజేశామని ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది అశ్విన్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న ఇచ్చిన ప్రోసీడింగ్స్ పై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.