అమరావతి: ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాన్ తీరం దాటింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
అటు తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ భద్రాత్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు, రేపు మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.