నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక నెల్లూరు, తిరుమలలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఆగకుండా భారీ వర్షం పడడంతో ప్రధాన రోడ్లన్ని మొత్తం జలమయం అయ్యాయి. నెల్లూరులోని నర్తకి, గాంధీబొమ్మ, వీఆర్‌సి, కనకమహల్, హరనాథపురం సెంటర్‌లో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులు వర్షానికి తడిసి ముద్దైతున్నారు. నిన్న రాత్రి నుంచి తిరుమలలో వర్షం కురుస్తోంది.
దీంతో లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. శ్రీవారి మాడవీధులు, ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిని బయటకు పంపేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే ఛాన్స్ ఉండడంతో, ప్రయాణికులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. అల్పవాయుపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో మరో ఐదు రోజుల వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.