అమరావతి: రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రేపు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41-42.5°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. అటు దేశవ్యాప్తంగా రకరకాల ద్రోణులు, ఆవర్తనాలు, మేఘాల వాతవరణం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు యానాం, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొంత భాగంలో 6 రోజులపాటూ వర్షాలు కురుస్తాయి అని ఐఎండీ చెప్పింది.