భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్స్‌ను ఉపయోగించాలని ఆదేశించారు. వరద ప్రవాహాలు, గట్ల పటిష్ఠతను వాటి సాయంతోనే అంచనా వేయాలని సూచించారు.
విజయవాడలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు. ముందస్తు చర్యలతోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కాస్తా ఉపశమనం లభించిందన్నారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడొచ్చన్నారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాల్లో పరిస్థితులపై సమీక్షించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఉత్తర, వాయువ్ దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 70 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 140 కిలోమీటర్లు, కళింగపట్నంకు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళ మధ్యాహ్నం పూరీ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.