తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
శుక్రవారం ఉదయం 6 గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 12 గంటలకు 23.50 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. 2,57,086 క్యూసెక్కుల నీరు దిగువకు తరలి వెళ్ళింది. భద్రాచలం ఏజెన్సీ లోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఒక గేటు రెండు అడుగుల మేర, 6 గేట్లు పూర్తిగా ఎత్తి 24,905 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు.