ఒక ప్రాణం నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత దూరమైనా వెళ్తారని మరోసారి నిరూపించారు. తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆఘమేఘాల మీద హెలీకాప్టర్ ను రప్పించి.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు.
ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స కొనసాగుతోంది. గుంటూరులో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అతని గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు సీఎం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేదలకు కేవలం కార్పొరేట్ వైద్యం అందించడమే గాక.. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయని అద్భుతాలు తన మంచి హృదయంతో చేయగలనని చాటి చెప్పారు.