స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. సెప్టెంబర్ 18వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబును సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీకి స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని, తనపై ఏసీబీ కోర్టు జరుపుతున్న విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు నాయుడుకు ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్’ కేసులో ఏసీబీ కోర్టు ఆదివారం రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 22 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.