వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, రేపు సీబీఐ వాదనలు విననుంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం నాడు సుదీర్ఘ సమయం పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. భోజన విరామం తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో నేడు సీబీఐ వాదనలకు అవకాశం లేకపోయింది. సీబీఐ వాదనలు రేపు వింటామని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం అవినాశ్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. అవినాశ్ తల్లి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయన కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈనెల 19న సీబీఐ విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని..అందుకే తాను సీబీఐ విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ ద్వారా తెలియజేశారు.