పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలి : సీఎం చంద్రబాబు

దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

By Kalasani Durgapraveen  Published on  15 Dec 2024 2:15 PM GMT
పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలి :  సీఎం చంద్రబాబు

మానవతావాది పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడదామన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

2019 తర్వాత మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతత ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలు గడిచిందని, ఈ సమయం అంతా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడమే సరిపోయిందన్నారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తే అందులో ప్రజలు భాగస్వామ్యం కావొద్దన్నారు.

ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు నేడు అన్నారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన గొప్ప పోరాటం మరువలేనిదన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఈనాడు మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్నామన్నారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ఆలోచన చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు.

Next Story