రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన ఆగస్టు 15, 2021న జరిగింది. రమ్య హత్య తర్వాత డిసెంబరులో విచారణ ప్రారంభమైంది. శుక్రవారం తీర్పు వెలువడింది.
వివరాల్లోకివెళితే.. గుంటూరు జిల్లా పరమయ్యకుంటలో బీటెక్ చదువుతున్న రమ్య సోషల్ మీడియా ద్వారా శశికృష్ణతో పరిచయం ఏర్పడి.. ప్రేమ పేరుతో వేధింపులకు గురికాబడింది. ఈ నేపథ్యంలో తన మొబైల్ ఫోన్ నంబర్ ను యువతి బ్లాక్ చేసిందనే కోపంతో శశికృష్ణ.. గతేడాది ఆగస్టు 15న అందరూ చూస్తుండగానే రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు కూడా ఆందోళనకు దిగాయి. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా 24 గంటల్లో నరసరావుపేట సమీపంలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. హత్యకేసులో సీసీటీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరుపక్షాల వాదనలు విని ఏప్రిల్ 26న విచారణ పూర్తి చేసి.. ఈరోజు తీర్పు వెలువరించారు.