విశాఖ‌ను చంద్రబాబు ఓ గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు

Gudivada Amarnath Reddy Fires On TDP Leaders. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించినవాళ్ళే.. ఈరోజు రక్షిస్తామంటూ

By Medi Samrat  Published on  31 Aug 2021 2:13 PM IST
విశాఖ‌ను చంద్రబాబు ఓ గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించినవాళ్ళే.. ఈరోజు రక్షిస్తామంటూ చర్చా వేదికలు, బస్సు యాత్రలు చేస్తామంటుంటే.. ఉత్తరాంధ్ర ప్రజలు ఒకవైపు ఆశ్చర్యానికి గుర‌వుతార‌ని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్త‌రాంధ్ర టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలను చూసి ప్ర‌జ‌లు అసహ్యించుకుంటున్నారని విమ‌ర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్నాళ్ళు విశాఖపట్నాన్ని చంద్రబాబు ఒక గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు తప్పితే.. ఏనాడూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కనీసం ప్రయత్నించలేదన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ చేస్తే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు అమరావతి జపం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి మీద కూడా చంద్రబాబుకు ఉన్నది కమర్షియల్ అటాచ్ మెంటేగానీ.. ఎమోషన్ అటాచ్ మెంటు కాదని చెప్పారు.

2019 సాధారణ ఎన్నికలు మొదలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఉత్తరాంధ్ర ప్రజలు.. టీడీపీ బట్టలు విప్పి నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గు రావడం లేదని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా.. ఆ పార్టీ నాయకులకు మాత్రం చంద్రబాబు మత్తు దిగటం లేదని మండిప‌డ్డారు. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టినా.. ఇంకా బుద్ధి రాలేదా అన్నది వారే తేల్చుకోవాలని అన్నారు. ఇంకా చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు చెంచాల్లా మిగలాలనుకుంటే అది వారి ఖర్మ అని అన్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్రలోని విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకూ అభివృద్ధికి బీజం వేస్తే దాన్ని ఏరకంగా టీడీపీ అడ్డుకుంటుందో అందరికి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్‌.. దేశ చిత్రపటంలో ఒక గుర్తింపును తీసుకు వచ్చారని అన్నారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలని చూస్తుంటే మరి ఏ హక్కుతో టీడీపీ ఇవాళ ఉత్తరాంధ్ర పరిక్షణ వేదిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసిందని ప్ర‌శ్నించారు.


Next Story