వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోటరీని దూరం పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. అయినా ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలన్నారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే, ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు.. మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని అన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయని ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం అని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్లు ఇప్పుడు పార్టీలు మారుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వాళ్లు వెళ్లిపోయేవారా? అని ప్రశ్నించారు.