ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ఈ విషయమై పలు సంస్థల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఐదు రోజుల పాటు జరిగిన సదస్సుకు పెవిలియన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో ఏపీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ రోల్ మోడల్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు. ఏపీలో 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు.