నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By - Knakam Karthik |
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపజేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు ఆయన చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమంతో రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లవుతుంది.
విస్తరణ ప్రణాళిక ప్రకారం, మొదటి దశ పనులను రూ.140 కోట్లతో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు ఏడంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం వంటివి నిర్మిస్తారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం, పవిత్ర పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ పనులను కూడా మొదటి దశలోనే పూర్తి చేస్తారు. వీటన్నింటి నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించారు.
ఇక రెండో దశ పనులను రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందులో తిరుమల తరహాలో ఆలయ మాడ వీధులు, ఆలయానికి చేరుకునే అప్రోచ్ రోడ్లు, భక్తుల కోసం భారీ అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి భవనం నిర్మిస్తారు. వీటితో పాటు అర్చకులు, ఆలయ సిబ్బంది నివాసం కోసం క్వార్టర్లు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు. ఇప్పటికే మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తికాగా, ఇవాళ్టి శంకుస్థాపనతో రెండు, మూడో విడత పనులు ప్రారంభం కానున్నాయి. నాలుగో విడత పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.