అమరావతి: పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఎంపిక చేసింది.
పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్థికమంత్రికి తెలిపారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టు లకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్న సిఎం..ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్దికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.