ఓ మేనమామగా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పాటుపడుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగలా జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారని.. వరుసగా నాలుగో ఏడాది విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యాకానుక అందిస్తున్నామని.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కిట్లలోనూ మార్పులు చేశామని వివరించారు. స్కూలు బ్యాగు సైజు పెంచామని, యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామని అన్నారు. ఈ ఒక్క పథకంపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.3,366 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని చేపట్టారు. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందచేస్తోంది.