ఏపీలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది
By - Knakam Karthik |
ఏపీలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది. గతంలో ఏపీ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి సూచించిన ఆరు కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు అంశాల అమలు ప్రక్రియను ప్రారంభించింది. దీనివల్ల పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యలు పరిష్కారం వైపు సాగుతున్నాయి. పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా దశలవారీగా ప్రారంభమయ్యాయని, కొనుగోలు ప్రక్రియ మొదలైందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అయితే మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సి.సి.ఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, మిగిలిన మూడు అంశాలైన L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణం కారణంగా తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ అంశాల ప్రాధాన్యతను వివరించి, రైతులకు తక్షణ ప్రయోజనం కలిగేలా చూడాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ సమావేశంపై కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశముందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకూ నిరంతరం అనుసరిస్తాం, కేంద్రం నుండి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగి, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు సి.సి.ఐ ద్వారా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు సంబంధిత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రానికి జిల్లా మార్కెటింగ్ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 11 మార్కెట్ యార్డులతో పాటు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19 జిన్నింగ్ మిల్లుల ద్వారా రూ.56.59 కోట్ల విలువైన 72,240 క్వింటాళ్ల పత్తిని 2,793 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు.
అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, అధిక తేమ శాతం, కొన్ని జిల్లాల్లో పత్తి తీతలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం. అలాగే కొంతమంది రైతులు మొదటి-రెండవ తీత పత్తిని కలిపి విక్రయించాలని ఎదురు చూస్తుండటంతో, అన్ని కేంద్రాలలో కొనుగోలు పూర్తి స్థాయిలో జరుగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. పత్తి కొనుగోలు కోసం కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్ లలో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు గ్రామాలలో పనిచేసే వ్యవసాయ సహాయకులు (VAA) చొరవ తీసుకొని స్లాట్ బుకింగ్ చేయటంలో రైతులకు సహయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.