ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్ల పైబడిన ప్రయాణికులకు బస్సుల్లో రాయితీ లభించనుంది.

By Medi Samrat  Published on  23 Sept 2023 7:43 PM IST
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్ల పైబడిన ప్రయాణికులకు బస్సుల్లో రాయితీ లభించనుంది. సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీని పొందాలనుకునే 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడెంటిటీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులలో ఒకదానికి ప్రయాణ సమయాల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ లో ఆధార్ కార్డును చూపించిన రుజువుగా భావిస్తారు. ఈ కార్డుల్లో ఏ ఒక్కదాన్ని చూపించినా వృద్ధులకు టికెట్లలో 25 శాతం రాయితీ కల్పించనున్నారు. వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీని 2022 నుంచీ అమలుచేస్తున్నారు.

ఇక ఆర్టీసీ బస్సుల్లోనూ మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టనుంది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రెండు ఊర్లకు మధ్య డైరెక్ట్ బస్సులు లేని సమయంలో మధ్యలో ఉన్న ఒక ఊరికి.. అక్కడి నుండి చేరుకోవాల్సిన ప్రాంతానికి రిజర్వేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండొచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టింది.

Next Story