అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.!

Good News Agri Gold Victims. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చారు.

By Medi Samrat  Published on  15 Dec 2020 12:27 PM GMT
అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.!

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చారు. నవరత్నాలు అనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలులో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు. ఇప్పటికే పది వేల రూపాయల నగదును డిపాజిట్ చేసిన బాధితులకు వారి ఖాతాలో పది వేల రూపాయలను జమ చేశారు. ఇందుకోసం దాదాపు రూ.1,150 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేటాయించారు.

అయితే.. ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి తొలిదశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి గతేడాది.. అక్టోబర్‌ నెలలో డిపాజిటర్లకు వారి ఖాతాలో జమ చేశారు. రెండో దశలో భాగంగా 20,000 లోపు డిపాజిట్ చేసిన బాధితులకు సైతం నగదును చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా అందుకు తెలంగాణ హైకోర్టు గత నెల 9వ తేదీన అనుమతినిచ్చింది.

20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు డబ్బు చెల్లించడానికి అనుమతి లభించడంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డ్, గ్రామ సచివాలయాల ద్వారా బాధితుల వివరాలను సేకరించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వచ్చే మార్చి 20 నాటికి బాధితుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ చెప్పారు. తొందరలోనే అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో స్వయంగా 20,000 రూపాయల డబ్బును జమచేయనున్నారు.




Next Story