మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. గాజువాకలో పవన్ కల్యాణ్ ని ఓడించి వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. గాజువాకలో నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. ఈ సమయంలో దేవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారింది. ఈ రాజీనామాపై దేవన్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఇంకా స్పందించలేదు. దేవన్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే వైసీపీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమిస్తూ, పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ పదవి ఖాళీ అయ్యింది. రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలిసింది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు నారాలోకేష్‌పై విజయం సాధించారు.