ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని మంత్రి లోకేష్ ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో భేటీ విషయాన్ని ఎక్స్ వేదికగా మంత్రి తెలిపారు. ఫాక్స్‌కాన్ సీనియర్ బృందాన్ని అమరావతిలో కలవడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ లో వెల్లడించారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి మనదేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఉద్యోగాల కల్పన కోసం ఫాక్స్‌కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి కాలం చెల్లిందన్న నారా లోకేష్.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదే తమ ప్రభుత్వం కొత్త మంత్రమని అన్నారు. ఫాక్స్‌కాన్ సహా ఇతర అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల కోసం వేగంగా ఇండస్ట్రియల్ జోన్లు రూపొందించడమే తమ లక్ష్యమంటూ ట్వీట్ చేశారు.