విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం
విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 11 Dec 2024 9:10 AM ISTవిశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం
విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన బాలురు కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘులుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ గుర్తించారు. బాలురు గోడ దూకి పారిపోయినట్టు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రుల మహారాణిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే స్కూల్, రైల్వేస్టేషన్ , బస్టాండ్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నలుగురిలో ఒకరు రూ.12వేలు తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. అతను మిగిలిన డబ్బుతో బయలుదేరే ముందు ఫీజు కోసం రూ.8,000 చెల్లించాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, గల్లంతైన బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సోమవారం నాడు తన కుమారుడితో మాట్లాడినట్లు కిరణ్ కుమార్ తండ్రి తెలిపారు. కిరణ్ కొండగుడి ఆలయాన్ని సందర్శించడం, బీచ్‌కు వెళ్లడం గురించి ప్రస్తావించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తండ్రికి తెలియదు. రఘు తండ్రి అప్పారావు మాట్లాడుతూ తన కుమారుడు నాలుగేళ్లుగా హాస్టల్‌లో ఉంటున్నాడని తెలిపారు. రెండు నెలల క్రితం హాస్టల్ సిబ్బందిలో ఒకరు రఘును తీవ్రంగా గాయపరిచారని, దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తప్పిపోయిన బాలురకు సంబంధించి హాస్టల్ యాజమాన్యం పొంతన లేని అప్‌డేట్‌లను అందించడంపై అప్పారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.