కర్నూలు జిల్లాలో నిరుద్యోగులను భారీగా మోసం చేసిన గ్యాంగ్

Four Members Arrested in Cheating Case Kurnool District. నిరుద్యోగులను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున డబ్బును కాజేసే కేటుగాళ్ల గురించి ఎప్పుడూ

By Medi Samrat  Published on  20 Aug 2021 10:11 AM GMT
కర్నూలు జిల్లాలో నిరుద్యోగులను భారీగా మోసం చేసిన గ్యాంగ్

నిరుద్యోగులను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున డబ్బును కాజేసే కేటుగాళ్ల గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. అలాంటి ఓ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో ఉద్యోగాల పేరుతో పలువురు యువకులను మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా దోచుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సుధీకర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నలుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను నమ్మించి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారని అన్నారు.

ఓర్వకల్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాధితుల దగ్గర ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షల చొప్పున కోటి రూపాయలు వరకూ వసూలు చేశారని తెలుస్తోంది. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించి ఉద్యోగార్థులను నమ్మించే ప్రయత్నం చేశారని అన్నారు. రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో రూ. 10 లక్షలు, 18 లక్షల 30 వేలు వసూలు చేశారు. కాగా, బాధితులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపారు. ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై మూడు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story