రెండేళ్లలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి : కేంద్ర మాజీ మంత్రి
రాబోయే రెండు సంవత్సరాల్లో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 30 July 2024 1:21 PM GMTరాబోయే రెండు సంవత్సరాల్లో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది ఆ రెండు కుటుంబాలేనని అన్నారు. తెలంగాణలో ఒక కుటుంబం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబం వల్ల తెలుగు ప్రజల ప్రతిష్ట బాగా దిగజారిందని.. ఆ రెండు కుటుంబాలకు అధికార దాహం, ధన దాహం ఎక్కువ.. తెలంగాణ 4 కోట్ల ప్రజలు, 5 కోట్ల ఆంధ్రులు నష్టపోయారని అని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో ఒక కుటుంబం పదేళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు సంపాదించారు. నేడు ఆయన కూతురు జైల్లో పడివుంది. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లకు పైగా అధికారంలో ఉంది. వేల కోట్లు సంపాదించారని అన్నారు. తెలుగు ప్రజలు నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇండియా కూటమికి వైసీపీ అవసరం లేదన్నారు. జగన్ చెల్లెలు ఆయనను ప్రతిరోజూ విమర్శిస్తోందన్నారు. మోదీయే పోలీసులకు చెప్పి, పర్మిషన్ ఇప్పించి, ఢిల్లీలో జగన్ చేత ధర్నా చేయించారని.. మోదీ, జగన్ ట్రిక్కులు మాకు బాగా తెలుసు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో దళితులు 20 శాతం ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది జగనేనన్నారు. ఎస్సీలకు రావాల్సిన రుణాలను ఆపి.. జగన్ పతనమైపోయాడన్నారు. దళితులకు న్యాయంగా రావాల్సిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను వెంటనే ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అద్వానంగా ఉంది. అప్పుల్లో ఉంది. జగన్ 7 లక్షల కోట్లు అని అంటాడు. కాదు 13.5 కోట్లు అని మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నాడు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అద్వానంగా తయారైందన్నారు.
గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటలైనా అధికారులు ఆఫీసుకు రాలేదు. తాళాలు తియ్యలేదు. మొన్న ఆదివారం మదనపల్లికి వెళ్లాను. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. వేల ఎకరాలు ఎస్సీల భూములను లాక్కునేదానికి కుట్రతో ఫైళ్లను కాల్చేశారు. బీరువా లోపల ఫైళ్లు లేవు. 7 లీటర్ల డీజిల్, కిటికీ దగ్గర కొత్త అగ్గిపెట్టె ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మదనపల్లి పైల్స్ కేసులో పోలీసులు, రెవెన్యూ అధికారులను నేను అభినందిస్తున్నాను. ఎవరు చేసినా.. ఎంత పెద్ద వారైనా శిక్షకు అర్హులేనన్నారు. రెవెన్యూ వ్యవస్థను జగన్ పాడు చేశాడు. పాత రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రైతుల పాసుపుస్తకాలపై రాజముద్ర ఉండాలని అన్నారు.