వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టుకు..సుప్రీంకోర్టు తిరిగి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని వాదించారు. దీంతో ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు వల్లభనేని వంశీకి అరెస్టు నుంచి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు జారీ చేశారు.