పేర్ని నానికి ఊరట
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 4:16 PM ISTవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ6గా పోలీసులు తెలపగా. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
పీడీఎస్ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణా జిల్లా బందర్ పోలీసులు పేర్ని నానిని ఆరో నిందితుడిగా చేర్చారు. పేర్ని నాని భార్య జయసుధ ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జయసుధకు స్థానిక కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండో నిందితుడు మానస తేజ, మేనేజర్ నాని, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను అరెస్టు చేశారు.