అమరావతి: అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రాజీవ్‌ను పోలీసులు ఏ1గా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 15 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఇంటిని మొత్తాన్ని జల్లెడ పట్టిన ఏసీబీ అధికారుల బృందం పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఆ తర్వాత ఈ కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్యగా జోగి రాజీవ్ పేర్కొన్నారు. తన తండ్రి రమేష్‌పై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అందరూ కొనుగోలు చేసినట్లే తాము భూములు కొన్నామని అన్నారు. అయితే అందులో తప్పేముందో తనకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు.