అమరావతి: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని స్పందించారు. తనపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందన్నారు. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. న్యాయం పోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టింది.
విడదల రజినితో సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్‌లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్ల అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలో 384, 120 బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.