ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పదవులకు రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశానని.. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా వెనక పూర్తిగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయన్నారు. ఇక వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటానని.. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు, పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని వివరించారు. ఏలూరులో వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు ముగిసిందని ఆళ్ల నాని చెప్పారు. దీంతో అక్కడ పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామని తెలిపారు.
పార్టీ కార్యాలయం లీజుకు ఇచ్చిన వ్యక్తి అమెరికాలో ఉంటారని.. రవిచంద్ర అనే తన స్నేహితుడు పార్టీ కార్యాలయానికి స్థలం లీజుకు ఇచ్చారన్నారు. 2017లో ఆ స్థలం లీజుకు తీసుకున్నామని ఆ తర్వాత అక్కడే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. గతేడాది ఆ స్థలం తిరిగివ్వాలని యజమాని కోరినట్లు ఆళ్లనాని చెప్పారు. స్థలం యజమాని అనుమతితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపామని, ఆ తర్వాత షెడ్లను తొలగించి స్థలాన్ని అప్పగించామన్నారు.