ఎంత కష్టం.. బాలుణ్ని అనాథను చేసిన మహమ్మారి
Five Deaths In One Family Due To Corona. కరోనా మహమ్మారి ఆ కుటుంబంపై పగ పట్టింది. ఒకే ఇంట్లో అయిదుగురుని బలి తీసుకుంది.
By Medi Samrat
కరోనా మహమ్మారి ఆ కుటుంబంపై పగ పట్టింది. ఒకే ఇంట్లో అయిదుగురుని బలి తీసుకుంది. ఫలితంగా 12 సంవత్సరాల మేడిచర్ల సాయి సత్య సహర్ష అనాథగా మిగిలాడు. మొన్నటి వరకూ అమ్మా, నాన్న, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య పంచన గారాల బాబుగా ముద్దూ మురిపాలు అందుకున్న ఆ పసివాడికి.. కరోనా ఒక్కసారిగా అన్నీ దూరం చేసేసింది. రాజనగరం సమీపంలోని గైట్ కాలేజీ ఎదురుగా బ్రిడ్జి కౌంట్ లో నివాసం ఉంటున్న సుధీర్ రాయల్, శ్వేత హరితల ఏకైక కుమారుడు సాయి సత్య సహర్ష.
రాజమహేంద్రవరం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సెకండ్ వేవ్ కరోనా ఉదృతి నేపథ్యంలో సహర్ష ఇంట్లో అందరూ మృతి చెందారు. వీరు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం దక్కకపోగా, ఆ ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ. 28 లక్షలు వసూలు చేసినట్టు ఎంపీ మార్గాని భరత్ రామ్ దృష్టికి పలువురు తీసుకువచ్చారు. దీంతో వెంటనే ఆ బాలుడిని పరామర్శించేందుకు రాజమహేంద్రవరం శివార్లలో గల బ్రిడ్జి కౌంట్ లో నివాసం ఉంటున్న అతని ఇంటికి శనివారం వెళ్ళారు. బాలుడిని పరామర్శించారు. ప్రస్తుతం మేనమామ పర్యవేక్షణలో ఆ బాలుడు ఉన్నాడు. మేనమామను పరామర్శించి ఎంపీ భరత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకే ఇంట్లో అయిదుగురు కరోనా కారణంగా మృతి చెందటం చాలా దురదృష్టకరమని అన్నారు. వైద్యం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు అయినా పిల్లాడు అనాథగా మిగిలాడాడని విచారం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కూడా కోరతానన్నారు. కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.
అప్పుచేసి ఆసుపత్రికి సొమ్ములు కట్టినట్టు తెలిసిందన్నారు. ఆ సొమ్ములు తిరిగి ఇప్పించటంతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే సీఎం జగనన్న కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఈ బాలుడు విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరంలోనే చేరేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.