శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ''కావలి సమీపంలో ఈరోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్ లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ పేర్కొన్నారు.