అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసిపి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని.. కౌలు కూడా సక్రమంగా చెల్లించకుండా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అన్నారు.
గత ఏడాది కరోనా కారణం చూపి ఒక నెల ఆలస్యంగా కౌలు చెల్లించారని.. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు అధిక శాతం సన్న, చిన్నకారు రైతులేనని రామకృష్ణ అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కౌలు చెల్లించక పోవడంతో అమరావతి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రాజధానికి భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదే విషయమై టీడీపీ యువ నేత లోకేష్ కూడా సిఆర్డిఏ/ఏఎంఆర్డీఏ కమిషనర్ కు లేఖ రాశారు. కౌలు విడుదలతో పాటు రైతుల ఆరోగ్య సంరక్షణ చేపట్టాలి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణకు రైతులు తమ భూమిని త్యాగం చేశారు. ప్రతి ఏటా మే నెలలో వీరికి కౌలు చెల్లించాలి. కరోనా మొదటి దశలో గత ఏడాది కౌలు చెల్లింపు నెలరోజులకు పైగా ఆలస్యం చేయటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కరోనా రెండో దశలో ఈ ఏడాది కూడా కౌలు ఇంత వరకూ కౌలు చెల్లించకపోవటం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.