అంతుచిక్క‌ని వ్యాధితో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇటీవలే వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ కొందరు స్థానికులు అస్వస్థతకు గురవుతుండడం అలజడి రేపుతోంది. వరుసగా కొందరు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ(26) అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంట‌నే స్పందించిన కుటుంబ స‌భ్యులు, స్థానికులు అత‌డిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఇదే విధంగా గ్రామంలో ఉన్న మ‌రో ఇద్ద‌రు స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. స్థానికంగా ఉన్న ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువ‌డుతున్న వ్య‌ర్థాల కార‌ణంగా అనారోగ్యానికి గుర‌వుతున్నామ‌ని గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా.. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలోనూ ఆరుగురు రైతు కూలీలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు నిన్న ప్రాణాలు కోల్పోయారు.


సామ్రాట్

Next Story