చికెన్ పకోడీ సెంటర్ దగ్గర దొరికిపోయిన దొంగనోట్ల ముఠా.. నోట్ల ముద్రణ ఎలా చేశారంటే..

Fake Currency Gang Arrested. మార్కెట్ లోకి దొంగ నోట్లను తీసుకుని రావడానికి ఎన్నో ముఠాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

By Medi Samrat  Published on  28 Sep 2021 3:48 PM GMT
చికెన్ పకోడీ సెంటర్ దగ్గర దొరికిపోయిన దొంగనోట్ల ముఠా.. నోట్ల ముద్రణ ఎలా చేశారంటే..

మార్కెట్ లోకి దొంగ నోట్లను తీసుకుని రావడానికి ఎన్నో ముఠాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాంటి ముఠాను పోలీసులు అధికారులు పట్టుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నోట్ల మార్పిడి చేస్తూ దొరికిపోయే బ్యాచ్ లు కూడా ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో కొందరు దొంగ నోట్లను యూట్యూబ్ లో చూసి మరీ ముద్రించారు. కానీ చికెన్ పకోడీ సెంటర్ వద్ద చోటు చేసుకున్న గొడవ కారణంగా అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంకు చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీం అనే వ్యక్తులు బంధువులు. భారీగా అప్పులు చేయడంతో ఎలాగైనా ఆ అప్పులు తీర్చేయాలని అనుకున్నారు. అప్పులు ఇచ్చిన వారి నుండి బయటపడాలని భావించి ఏకంగా డబ్బులను ప్రింట్ చేయాలని అనుకున్నారు. దీంతో యూట్యూబ్ లో డబ్బులు ఎలా ముద్రించాలో తెలుసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులను సమకూర్చుకున్నారు. ఇక నోట్ల ముద్రణ మొదలుపెట్టారు.

ఇలా రూ.100 నోట్లు ముద్రించి మార్కెట్లో మార్పిడి చేయాలని భావించారు. అయితే నూర్ బాషా జొన్నగిరి గ్రామం వెళ్లి చికెన్ పకోడీ తినాలని అనుకున్నాడు. చికెన్ పకోడీ బండి నిర్వాహకుడికి తాము ముద్రించిన 100 నోటు ఇచ్చాడు.. ఐతే ఆ వందనోటు మారదని దొంగనోటు అని చెప్పి.. వేరేది ఇవ్వాలని అడిగాడు. అయితే అందుకు నూర్ బాషా ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఖాన్ ను తనిఖీ చేయగా దొంగనోట్లు బయటపడ్డాయి.

అతడి దాదాపు 30 రూ.100 నకిలీ నోట్లు గుర్తించారు. నీకు ఇవి ఎక్కడివి అని పోలీసులు అతడిని విచారించగా మొత్తం బయటపెట్టాడు. యూట్యూబ్ లో నేర్చుకొని దొంగనోట్లు ముద్రించామని.. వజ్రకరూర్, గుంతకల్, మద్దికెర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన జిరాక్స్ మిషన్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.


Next Story
Share it